అన్ లాక్.1 వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులు

న్యూఢిల్లీ:ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం ప్రభావం దివ్యాంగుల పై కూడా పడింది. దివ్యాంగుల వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకులు కరోనా ప్రభావం వల్ల విధులకు హాజరు కావడం లేదు. దీంతో వికలాంగులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. వేరే ఎవరైనా వీరికి సహాయం చేయాలంటే ముందుకు రావడం లేదు. వారి చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే వారు కూడా వారికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక అంధుల పరిస్థితి
 వర్ణనాతీతం. దివ్యాంగులు స్వతహాగా వాహనాలు కూడా నడవలేరు. పూర్తిగా ప్రజా రవాణా లేదా క్యాబ్ సేవలపై ఆధార పడతారు. ప్రస్తుత ఈ పరిస్థితులలో ఇవి వికలాంగులకు క్షేమదాయకం కాదు. బహిరంగ ప్రదేశాలలో , మార్కెట్లలో మొదలగు చోట్ల సామాజిక దూరం కారణంగా వీరికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ మాట్లాడుతూ దాదాపు ఒక బిలియన్ మంది దివ్యాంగులు కరోనా వైరస్ కారణంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాధారణ పరిస్థితులలోనే దివ్యాంగుల జీవితాలు కఠినంగా ఉంటాయి. ప్రజలు వైరస్ ప్రభావం తో దివ్యాంగులకు సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. అందువలన దివ్యాంగుల జీవితాలు మరింత కఠినంగా మారాయి.