శిరిడి సాయి ఆలయం పై కరోనా ప్రభావం: ఆర్థిక ఇబ్బందులలో షిరిడీ సంస్థానం

శిర్డీ: మొత్తం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో భక్తులు షిరిడి సాయి దర్శనానికి వెళ్లాలంటే జంకుతున్నారు. భారత దేశంలోనే ధనిక ఆలయాల్లో ఒకటైన శిర్డీ సాయిబాబా ఆలయ సంస్థానం ‌పైనా ఈ కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారి విజృంభణతో భయపడిన భక్తులు దర్శనానికి రాకపోవడంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆలయ సిబ్బందికి వేతనాలు సైతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఒకవైపుదర్శనాలు నిలిచిపోవడం, మరోవైపువిరాళాలు రాకపోవడంతో పూర్తిగా ఆదాయం లేకుండా పోయింది.

సాధారణ రోజుల్లో శిర్డీకి రోజుకు 25వేల మంది, పండుగ సందర్భాల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. హుండీ ఆదాయం రోజుకు రూ.కోటి 50 లక్షల వరకు ఉండేది. కానీ, కరోనా వైరస్‌ కారణంగా అవన్నీ ఆగిపోయాయి. గతంలో వచ్చిన విరాళాలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన విరాళాల పై వచ్చే వడ్డీతో ఇప్పటివరకు ఖర్చులు నిర్వహించామని, ఇప్పుడు ట్రస్టు వద్ద డబ్బుల్లేవని శ్రీ షిరిడి సాయి సంస్థాన్ వర్గాలు వెల్లడించాయి. దర్శనాలు పునః ప్రారంభమైతేనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు.