
ముంబయి : 43 సంవత్సరాల క్రితం ఊహించని విధంగా తన వారికి దూరమైన ఓ వృద్ధురాలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
మహారాష్ట్రలోని తాల గ్రామంలో నివసిస్తోన్న పంచుబాయ్ అనే ఓ వృద్ధురాలు (90) అమరావతి జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతంలో40 ఏళ్ల క్రితం నిరాశ్రయురాలిగా ఉన్న ఆమెను చూసి నూర్ ఖాన్ అనే వ్యక్తి తాల గ్రామానికి తీసుకొచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా ఆచూకీ చెప్పలేకపోవడంతో తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఆమెకు అచ్చన్ అని నామకరణం చేశాడు. నూర్ ఖాన్ మరణం తర్వాత అచ్చన్‌ను ఎలాగైనా సొంతగూటికి చేర్చాలని భావించిన నూర్ ఖాన్ కుమారుడు ఇశ్రార్ ఖాన్ ఆమె చిరునామా కోసం ఆరా తీశాడు. ఆమె చెప్పేే మాటలు ఇశ్రార్‌కు అర్థం కాలేదు. గూగుల్ మ్యాప్ లో ఆమె చెప్పిన పదాల్ని రికార్డు చేసి ఆ ప్రాంతం కోసం వెతికాడు. అంతే… “గూగుల్ తల్లి” కరుణించి అమరావతి జిల్లా కంజమ్ నగర్ అని తేల్చింది. దీంతో వెంటనే ఆ గ్రామాధికారి ఫోన్ నెంబర్‌ను ఇంటర్నెట్ లో వెతికి కనుక్కున్నాడు. ఫోన్ చేసి వృద్ధురాలి వివరాలు చెప్పి విచారించాడు. వాట్సాప్ లో ఆ వృద్ధురాలి ఫొటో పంపడంతో 43 ఏళ్ల క్రితం తప్పిపోయిన పంచుబాయ్ అని గుర్తించారు.
ఆ అధికారి ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ వృద్ధురాలి మనవడు పృథ్వీరాజ్ షిండే వెంటనే ఇశ్రార్ ఖాన్‌ను సంప్రదించాడు. అలా నేడు ఇశ్రార్ ఆ వృద్ధురాల్ని షిండేకు అప్పగించాడు. ఈ సందర్భంగా షిండే తన నాన్న బైలాల్, తన తాత తేజ్‌పాల్, తప్పిపోయిన సమయంలో పంచుబాయ్ కోసం ఎంతో వెదికారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని, అయినా ఫలితం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారని వివరించాడు. మూడేళ్ల క్రితం తన తండ్రి, 2005లో తన తాత మరణించారని తెలిపాడు. వారిద్దరూ పంచుబాయ్ తిరిగొస్తుందని కళ్లు కాయలు కాచేలా వేచిచూశారని, ఆమెను చూడకుండానే చనిపోయారని దుఃఖించాడు. ఏదిి ఏమైనా 43 ఏళ్ల తర్వాత నాన్నమ్మ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఆమెను ఇన్నాళ్లు జాగ్రత్తగా చూసుకున్న ఇశ్రార్ ఖాన్ కుటుంబానికి షిండే ధన్యవాదాలు తెలిపాడు.