ఇచ్చట చైనా వస్తువులు అమ్మబడవు

హైదరాబాద్ : ప్రపంచ దేశాలలో చైనాపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతూ ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనా దేశమే కారణమని   ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్ముతున్నాయి. తాజాగా 20 మంది భారత సైనికుల మృతికి కారణమైన చైనాపై హైదరాబాద్‌ జనరల్‌ వ్యాపారుల సంఘం (ది హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా దేశ వస్తువులు అమ్మ కూడదని తీర్మానించింది. బేగంబజార్‌, ఫీల్‌ఖానా, సిద్ది అంబర్‌బజార్‌, ఉస్మాన్‌గంజ్‌, ఎన్‌.ఎస్‌.రోడ్డులోని హోల్‌సేల్‌ దుకాణాల్లో చైనా లో తయారైన వస్తువులు అమ్మకూడదని నిర్ణయించింది. బేగంబజార్‌ లోని మర్చంట్స్ అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వ్యాపార సంఘం అధ్యక్షుడు శ్రీరామ్‌వ్యాస్‌, ఉపాధ్యక్షుడు సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.