ముగ్గురు సైనికుల వీరమరణం
లద్దాఖ్: సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు మరణించారు.
రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకునే నేపథ్యంలో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
గత ఏప్రిల్ నుంచి లద్దాఖ్ ప్రాంతంలో చైనా గస్తీ పెంచడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. వారి కదలికలపై నిఘా వేసింది. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాలకు భారీ ఎత్తున చైనా దేశం తమ బలగాలను మోహరించడాన్ని గమనించింది. ఈ క్రమంలో గత నెలలో పాంగాంగ్ సరస్సు ఒడ్డున 2 దేశాల కు చెందిన సైనికులు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వైపులా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి రోజరోజుకీ ఉద్రిక్తంగా మారుతుండడంతో ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈ నెల ఓ ఉన్నతస్థాయి సైనిక అధికారుల సమావేశం జరిగింది. దీనిపై రెండు రోజుల క్రితం స్పందించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నట్లు ప్రకటించారు. ఇరు దేశాలు బలగాల్ని ఉపసంహరించు కుంటున్నట్లు తెలిపారు. కానీ చైనా కేవలం సైనికుల్ని మాత్రమే తరలించినప్పటికీ పెద్ద ఎత్తున యుద్ధ వాహనాల్ని సరిహద్దుల్లోనే మోహరించి ఉంచినట్లు ఓ సైనిక అధికారి తెలిపారు. సోమవారం రాత్రి ఇరు సైన్యాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఓ సైనికాధికారి సహా ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. చర్చల తర్వాత కూడా రెండు ఇరు దేశాల మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా మృతిచెందినట్లు సమాచారం. ఎంతమంది చనిపోయార్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చివరిగా 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత చైనాతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు అమరులయ్యారు.