కాళేశ్వరం సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్ రావు
మెదక్: కరోనా టీకా వచ్చే వరకూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నేడు ఆయన మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కాళేశ్వరం కాలువ పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రిలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. కరోనా విపత్తులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బులు వేస్తోందన్నారు. బ్యాంకులో ప్రభుత్వం వేసిన డబ్బులు ఎక్కడికీ పోవన్నారు. డబ్బులు తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయని దుష్ప్రచారం జరుగుతోందని… ఇది తప్పు అన్నారు. డబ్బులు అవసరం ఉన్న వారు మాత్రమే బ్యాంకుల వద్దకు వెళ్లాలని హరీష్ రావు సూచించారు. అందరూ వెళ్లి గందరగోళం సృష్టించవద్దన్నారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇప్పటికిప్పుడే కరోనా పోదని… నిపుణులు చెబుతున్నారన్నారు. నాయినీ బ్రాహ్మణులు లాక్ డౌన్ ముగిసాక తమ షాపులు తెరిచినా… తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. వేడి ఆహరం, వేడి నీళ్లు తాగాలని.. ఫ్రిజ్ లో పెట్టి తినవద్దని హరీష్ రావు సూచించారు. పసుపును వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టాలని… శానిటైజర్స్ ను వాడాలని.. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలని తెలిపారు. ప్రొటీన్ ఆహార పదార్థాలు, తాజా పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హరీష్ రావు తెలిపారు.