టీడీపీ మెడకు బిగుసుకుంటున్న ఇన్సైడర్ ట్రేడింగ్
- -టీడీపీ మాజీ మంత్రులపై సీఐడీ కేసులు
- -భూ కొనుగోళ్ల ఉచ్చులో మరికొందరు టీడీపీ నేతలు
- -సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు
- -కల్పించుకోవాలని ఈడీకి లేఖలు రాసిన సీఐడీ అధికారులు
- – కోట్లు విలువచేసే భూముల బాగోతం
- -తెల్ల రేషన్ కార్డు రైతుల పేరిట కొనుగోళ్లు
- -796 మంది రైతులను విచారించిన సీఐడీ
(నండూరి రవిశంకర్)
హైదరాబాద్:
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా జరిగిన భూమి కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రారంభమైన సీఐడీ దర్యాప్తు పెను సంచలనాలు రేపేలానే కనిపిస్తోంది. ఇప్పటిదాకా తనపై అవినీతి మరక అంటలేదని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయన పార్టీ నేతలు సన్నిహితులు… అమరావతి భూ కొనుగోళ్ల ఉచ్చులో చిక్కుకోనుందన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఈ దర్యాప్తు పూర్తి అయితే… చంద్రబాబును రాజకీయంగా తెరమరుగు కావడంతో పాటుగా టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతోందన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు తాను దర్యాప్తు చేస్తూనే… ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేయాలని ఆదాయపన్ను శాఖకు ఈ కేసులో మీరూ ఇన్వాల్స్ కావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు సీఐడీ అధికారులు లేఖ రాసిన వైనం కూడా కలకలం రేపుతోంది.
అయితే ఈ కేసు వివరాల్లోకి వెళితే… 2014 ఎన్నికల్లో విభజిత ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… రాజధాని లేని ఏపీకి విజయవాడకు సమీపంలోని గుంటూరు జిల్లా పరిధిలోని తుళ్లూరుకు అమరావతి అని పేరు పెట్టేసి రాజధానిగా ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందే… రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నూజివీడులో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లుగా తన పార్టీ నేతలతో ప్రచారం చేయించిన చంద్రబాబు… అమరావతిలో తనకు తన అనుయాయులకు పెద్ద ఎత్తున భూములు సేకరించుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే ఎటూ అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఆరోపణలను ఖండించి ముందుకు సాగింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం దక్కగా… వైసీపీ బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అమరావతిలో చంద్రబాబు అండ్ కో… ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఆరోపించిన వైసీపీ సర్కారు… దానిపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనకు అనుగుణంగా వైసీపీ సర్కారు… సీఐడీని రంగంలోకి దించేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన సీఐడీ… ప్రాథమికంగానే సంచలన విషయాలను వెలికితీసిందట. రాజధాని గ్రామాలకు చెందిన తెల్ల రేషన్ కార్డుదారులు ఎకరా రూ.3 కోట్లు విలువ చేసే భూములను భారీగా కొనుగోలు చేసినట్లుగా సీఐడీకి ఆధారాలు లభించాయట. ఇలా నిరుపేదలుగా ఉండి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కొనుగోలు చేసిన వారు ఒక్కరో ఇద్దరో కాదట… ఏకంగా 796 మంది ఉన్నారట. వీరందరి పేర్లను సేకరించిన సీఐడీ వారిని గుర్తించే పనిని మొదలెట్టిందట. ఇందుకోసం ఏకంగా నాలుగు దర్యాప్తు బ ందాలను సీఐడీ ఏర్పాటు చేసిందట. అదే సమయంలో ఈ కొనుగోళ్లకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేయాలని ఆదాయపన్ను శాఖకు ధర్యాప్తులో ఇన్ వాల్వ్ అయ్యి మనీల్యాండరింగ్ జరిగిందో లేదో తేల్చాలని ఈడీకి సీఐడీ లేఖలు రాసిందట. మొత్తంగా ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో అమరావతిలో పేదల పేరిట భూములు కొన్నదన్న ఆధారాలను పక్కాగానే పట్టేసిన వైసీపీ సర్కారు… ఏ క్షణంలో అయినా వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకునేలానే ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ నేతలపై ఐటీకి సీఐడి ఫిర్యాదు.. రాష్ట్ర విభజన తరువాత అమరావతిలో రాజధాని ఆలోచనను ముందుగానే తన సంబంధీకులకు లీక్ చేసి..వారు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఆర్దికంగా లాభ పడేలా చంద్రబాబు వ్యవహరించారని వైసీపీ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత దీని పైన సీఐడి విచారణ చేయించింది. అందులో కొందరు టీడీపీ నేతలు అక్కడ 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 మధ్య అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారి పైన సీఐడీ ఆరా తీసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి అసెంబ్లీలో రాజధానిని అధికారికంగా ప్రకటించే సమయం వరకూ ఆ ప్రాంతం లో జరిగిన భూ లావాదేవీల వివరాలను సేకరించింది. అందులో కొందరు టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యుల పేర్లతో..మరి కొందరు బినామీ పేర్లతో కొనుగోలు చేసారనేది ప్రభుత్వ వాదన.ఇప్పటికే దీని పైన టీడీపీ సైతం విచారణకు సిద్దమని ప్రకటించింది. దీంతో..సీఐడీ ద్వారా సేకరించిన నేతల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. పలువురు టీడీపీ నేతల పేర్లు ప్రస్తావన.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ఆర్దిక మంత్రి బుగ్గన ఇదే వ్యవహారంలో పలువురు టీడీపీ నేతల పేర్లు ప్రస్తావించారు. దీనికి టీడీపీ నేతలు సైతం స్పందించారు. తక్కువ ధరలకే భూములు దక్కించు కున్నారంటూ హెరిటేజ్ సంస్థ గురించి ప్రభుత్వం సభలో ప్రస్తావించింది. ఇక, మాజీ మంత్రులు లోకేశ్ బినామీలంటూ కొందరి పేర్లు బయటకు తెచ్చింది.
అదే విధంగా మాజీ మంత్రి యనమల అల్లుడు మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ, దేవినేని, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత వంటి వారు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు.. కొమ్మాలపాటి శ్రీధర్..తెలంగాణ నేత వేం నరేందర్ రెడ్డి వంటి వారి పైన ఆరోపణలు చేసింది. ఆదాయపు పన్ను చెల్లించకుండా నల్లధనంతో భూములు కొనుగోలు చేసారనేది తాజా అభియోగం. ఈ వ్యవహారం పైన చర్యల కోసం ఐటీ శాఖకు నివేదిక పంపాలని సీఐడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 27న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. దీని పైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని సీబీఐ లేదా లోకాయుక్త కు విచారణకు అప్పగించాలని ప్రతిపాదించారు. అయితే, ఇప్పుడు ఇందులో ఆర్దిక అంశాలు సైతం ముడి పడి ఉండటంతో సీబీఐకి ఇవ్వాలని మంత్రులు ప్రతిపాదిస్తున్నారు. దీని పైన కేంద్రంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ అంశం పైన విచారణ ఏ సంస్థకు అప్పగించాలనే దాని పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే వందలాది ఎకరాలు తెలుగుదేశం నేతలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకష్ణ, తన బంధువుతో కలిసి అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలను కొనుగోలు చేశారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ప్రత్యేక కథనాన్ని ఈరోజు ప్రచురించింది. ఏపీకి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించకముందే ఈ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు పత్రిక కథనంలో పేర్కొంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మంత్రులు నారాయణ, నటుడు మురళీ మోహన్ హెరిటేజ్ సంస్థ వందల ఎకరాలను కొనుగోలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
గుంటూరు – విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలక ష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారని ఆరోపణ. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి” అని వైసీపీ నేతలు అంటున్నారు. పురపాలక, పట్టణాభివ ద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటకు తెస్తామనిఅన్నారు. అమరావతిలో భూ సమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని బొత్స వ్యాఖ్యానించారు.
అవసరం ఉన్నప్పుడు.. అవకాశాలు ఉన్నప్పుడు నగరాలకు ప్రజలు తరలిపోతారు. అక్కడ తమకు ఉపాధి లభిస్తుందనుకుంటే వేల మైళ్లలోని నగరాలకు కూడా ప్రజలు తరలుతారు. ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా.. నగరాల్లోకి ప్రజలు వలస వెళ్తూ ఉంటారు. ఎవరి పని నిమిత్తం వారు అక్కడకు వెళ్లి సెటిలవుతారు. అది ఏ రాజధాని విషయంలో అయినా జరిగేది. అయితే అమరావతి ప్రత్యేకం కదా! అందుకే.. ప్రజలు అక్కడకు తరలి రాకముందే.. తామే ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఉచితంగా కాదులెండి! కోట్ల రూపాయల ధరకు. అప్పట్లో సీఆర్డీఏ ఆధ్వర్యంలో ‘హ్యాపీనెస్ట్’ అంటూ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ రియలెస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి, అపార్ట్మెంట్లు కట్టి, ఫ్లాట్లను అమ్మే సంగతెలా ఉన్నా.. ప్రభుత్వమే ఒక రియలెస్టేట్ వెంచర్ వేసి, భవంతులు కట్టి.. సీఆర్డీఏ ద్వారా వాటి నిర్మాణం, అమ్మకం సాగుతుందని ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. అలా అచ్చంగా రియలెస్ట్ వ్యాపారాన్ని ప్రభుత్వమే మొదలుపెట్టింది. అందుకు సంబంధించి ‘హ్యాపీనెస్ట్’ అంటూ కట్టబోతున్నట్టుగా సైతం ప్రకటించారు. ఆ ప్రతిపాదన చేసి, బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. కేవలం మూడుగంటల వ్యవధిలో మూడువందల ఫ్లాట్లు బుక్ అయినట్టుగా ప్రకటించుకున్నారు. అలా సీఆర్డీయేను ఒక పచ్చి రియలెస్టేట్ సంస్థగా మార్చి వ్యాపారం చేయబోయారు. అయితే చంద్రబాబు హయాంలో ఆ హడావుడి అంతా జరిగింది. కానీ ఆ ‘హ్యాపీనెస్ట్’కు సంబంధించి ఎలాంటి నిర్మాణాలూ మొదలుకాలేదు. ఆ ప్రాజెక్టు పూర్తిగా పట్టాలే ఎక్కలేదు. ఇప్పుడు సీఆర్డీయే రూపం మారిపోయింది. అధికారులు బదిలీ అయిపోయారు. ప్రభుత్వం ధోరణి మారిపోయింది. దీంతో ఆ హ్యాపీనెస్ట్ కూడా కొశ్చన్‌మార్క్ అయిపోయిందని స్పష్టం అవుతోంది..
కంభంపాటి వంటి నేతలు తాము 2006లో కొన్న భూములను 2014 తర్వాత కొన్నట్లుగా వైసీపీ నేతలు పేర్కొని, తన పరువుకు నష్టం కలిగించారంటూ డిఫర్మేషన్ కేసు వేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. పరిటాల శ్రీరామ్, ధూళిపాళ్ళ నరేంద్ర కూడా వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు తాజాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించే ముందే వైసీపీ నేతలు వైజాగ్‌లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బొత్స సత్యనారాయణతోపాటు పలువురు వైసీపీ నేతలు విశాఖలో భూములు కొన్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్న వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేసిన తెలుగుదేశం నాయకులపై పరువునష్టం దావాలను వేస్తామని ప్రకటిస్తున్నారు.
మొత్తమ్మీద రాజధాని రచ్చ ఏమో గానీ భూముల కొనుగోళ్ళే ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచాయితీకి దారితీస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా భూములు కొన్నారో తేలేది.. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నిగ్గు తేల్చేది ఇక న్యాయస్థానాలేనేమో!