దశాబ్దాల కల కడప ఉక్కు పరిశ్రమకు జగన్ శంకుస్థాపన ..
- -వైఎస్ తర్వాత జిల్లాను పట్టించుకునే నేత కరువయ్యారు
- -నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలతోనే రాయలసీమ ప్రగతి
- -రూ.15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమకు పునాది
- -అభివృద్ధిని పట్టించుకోని తెలుగుదేశం పార్టీ
- -కుందూ నది ప్రాజెక్టులతో కడప, కర్నూలుకు మేలు
- -రూ.23000 కోట్ల రూపాయలతో సీమకు సాగునీరు
- -రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం
- -రాయతీల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం
- -జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో ప్రసంగించిన జగన్
కడప:
పారిశ్రామిక రంగంలో కడప జిల్లా పరుగులు పెట్టాలని కలలు కన్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన సున్నపురాళ్లపల్లెలో నిర్మించనున్న ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాను పట్టించుకునేవారు కరవయ్యారన్నారు. గతంలో ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు టెంకాయ కొట్టి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారని పేర్కొన్నారు.
‘రాయలసీమకు మంచి జరగాలంటే నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలి. కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. మూడేళ్లలో ఈ పరిశ్రమ పూర్తి చేస్తాం. రూ.15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేసుకున్నాం. ఈ పరిశ్రమ ఇక్కడి రావడానికి ఎన్‌ఎండీసీతో ముందడుగు వేశాం. రాష్ట్రం విడిపోయాక 5 ఏళ్లపాటు చూశాం.. ఎవ్వరూ పట్టించుకోలేదు’ అని సీఎం అన్నారు. కడపకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత సున్నపురాళ్ల పల్లెలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అనంతరం మైదుకూరు నియోజకవర్గం నేలటూరు చేరుకున్నారు. కుందూ నదిపై జొలదరాశి, రాజోలి, బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. గండికోట నుంచి వెళ్లే కాల్వల సామర్థ్యాన్ని 4వేల నుంచి 6వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వరద వచ్చే సమయంలో ప్రాజెక్టులను నీటితో నింపేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను నీటితో సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిని పెన్నా బేసిన్‌కు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ చెప్పారు. బొల్లేపల్లిలో రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి బనకచర్లకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. దీనికి ఈ రూ.60వేల కోట్లు ఖర్చు చేయనున్నామని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. రెండు మూడు నెలల్లో ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలను పూర్తి చేసి టెండర్లు పిలుస్తామని చెప్పారు. రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు.
వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నేలటూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్టు తెలిపారు. దువ్వురు నుంచి బ్రహ్మంసాగర్ నీటి తరలింపుతో తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని అన్నారు. బ్రహ్మంసాగర్ కింద 90 వేల ఎకరాలను నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు.
సభలో సీఎం ప్రసంగిస్తూ.. ‘బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీ లు పూర్తి సామర్థ్యం వైఎస్సార్ హయాంలో జరిగింది. గతంలో భారీ వరదలు వచ్చినా డ్యాంలు నిండలేదు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు కింద 90 వేల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల కేటాయింపు చేస్తాం. 2008లో వైఎస్సార్ జారీ చేసిన 224 జీవోపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. కుందూ నదిపై చేపట్టిన మూడు ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు మేలు జరుగుతుంది. రూ.2300 కోట్ల తో ఈ పనులు చేపడుతున్నాం. ఈ ఏడాది భారీ వరదలు రావడంతో.. శ్రీశైలం గేట్లు ఎనిమిది సార్లు ఎత్తాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు వ ధాగా సముద్రంలో కలిసింది. వరద నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రధాన ప్రాజెక్టు కాలువలను వెడల్పు చేయలేదు. అందుకే వరద నీరు వ థాగా సముద్రంలోకి వెళ్తోంది. రాయలసీమ ఇరిగేషన్ కాలువల సామర్థ్యం చంద్రబాబు పెంచి ఉంటే వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే వాళ్లం. రూ.23000 కోట్ల రూపాయలతో సీమలోని అన్ని సాగునీటి కాలువ సామర్థ్యం పెంచుతున్నాం. మొత్తం 60 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడుతున్నాం. గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వధాగా వెళ్తోంది. కష్ణ, గోదావరి జలాలతో ఏపీని సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు’ అని అన్నారు.
ప్రాజెక్టులో భాగంగా జోలరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టి.. వరద సమయంలో 8 టీఎంసీ ల నీటిని దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం క షి చేస్తోంది. అలాగే కేసీ, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2234 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. దీంతో రాయలసీమకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు. ఇందుకోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్‌ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప-నంద్యాల రైల్వే ట్రాక్ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. ఇలా కీలకమైన అన్ని వనరులు సమకూరిన తర్వాతే శంకుస్థాపన చేస్తుండటం.. ఈ ప్రాజెక్టుపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
కేంద్రం నుంచి రాయితీల డిమాండ్
ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు అదనంగా కేంద్రం నుంచి కూడా పలు రాయితీలను కోరుతోంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి తొలి ఏడేళ్లు ఐజీఎస్టీ మినహాయింపు, పదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు, దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాల మినహాయింపులను కోరుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూపాయికే ఇవ్వనుంది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, భూమి కొనుగోలు లేదా లీజు ఫీజుపై 100 శాతం మినహాయింపు, ఏడేళ్లపాటు ఎస్‌జీఎస్టీ వంటి అనేక రాయితీలను ఆఫర్ చేస్తోంది.