క్రిస్మస్ అంటేనే నోరూరించే బోల్డన్ని కేకులు గుర్తొస్తాయి. ఎన్ని రకాల స్వీట్స్ చేసుకున్నా ఈ పండగకు కేకులు లేనిదే నిండుదనం రాదు. బనానా, డబుల్హార్ట్, ఫ్రూట్, ఫైనాపిల్, చాకో, ఫ్లోర్‌లెస్ ఇలా.. ప్లేవర్ ఏదైనా నోటిలో పడితే.. కరిగిపోవాల్సిందే! పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే, మెచ్చే అలాంటి కేక్ రెసిపీల్లో కొన్ని ఇవి. మీరూ.. ట్రై చేయండి !!
క్రిస్మస్, న్యూ ఇయర్ కి.. కేక్స్ కి విడదీయలేని బంధం. క్రిస్మస్ క్రీస్తు పుట్టిన రోజు కాగా.. న్యూ ఇయర్ ఈవ్.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే వేడుక. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ రెండు వేడుకలను కేకులు లేకుండా కలలోనైనా ఊహించలేం. ఐతే ఈసారి హైదరాబాద్ నగరంలో జరిగే వేడుకల కోసం.. కేక్ మేకింగ్ లో నయా ట్రెండ్ షురూ అయ్యింది. కస్టమర్స్ కు అవసరమైన సందర్భం, సెలబ్రేషన్ తీరు ఆధారంగా కేక్స్ ని అందించడం ఇప్పుడు నడుస్తున్న వినూత్న ఒరవడి. డిజైనర్ కేక్స్‌కు థీమ్స్‌ను జోడించడం రీసెంట్ ట్రెండ్. అందుకోసం ప్రత్యేకంగా భాగ్యనగరంలో కేక్ బొటిక్‌లు ఏర్పడ్డాయి. కేక్స్‌ను ఒక ఫ్యాషన్ తో, ఆసక్తికరంగా డిజైన్ చేయడం ఈ సరికొత్త ట్రెండ్ కి మరింత ఊపునిస్తోంది. ఈ సీజన్లో క్రిస్మస్, న్యూ ఇయర్ లను క్యాష్ చేసుకోవడంతో పాటు, క్రేజ్ పెంచుకుంటున్నారు కేక్ మేకర్స్. కొత్తకొత్త డిజైన్లు, అనేక రకాల రుచుల్లో కేకులు నోరూరిస్తున్నాయి. చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, మ్యాంగో, పైనాపిల్ సహా అన్ని రకాల ఫ్కూట్ఫ్లేవర్స్ అందుబాటులోకి వచ్చాయి. కేక్స్ తినడానికి టేస్టీగా, చూడడానికి కలర్ ఫుల్ గా ఉంటున్నాయి. క్రిస్మస్ కి డిఫరెంట్ గా కార్పొరేట్ గిఫ్టింగ్ ని మార్కెట్ లోకి తెచ్చారు బేకరి నిర్వాహకులు. అకేషన్ కు అనుగుణంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఆఫీస్ లో బహుమతులుగా ఇచ్చేలా అందంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ బాక్స్ లో ప్లమ్ కేక్, కుకీస్, నట్స్ ఇలా మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ కు కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం వివిధ సంస్థలు ప్రీ బుకింగ్ చేసుకుంటున్నాయి. మరోవైపు హైదరాబాద్ లోని బేకరీలు, కేక్ మేకింగ్ షాపులు కస్టమర్స్ తో సందడిగా మారాయి. అటు కస్టమర్లు తమ అభిరుచులకు అనుగుణంగా థీమ్స్ ను ఎంచుకుంటున్నారు. కేక్ మేకింగ్ లో వచ్చిన నయా ట్రెండ్ హైదరాబాద్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను మరింత ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.
సిట్రస్ కేక్

కావల్సిన పదార్థాలు: వెన్న, చక్కెర పొడి – 100 గ్రాముల చొప్పున, గుడ్లు – నాలుగు, మైదా – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – రెండు చెంచాలు, వంటసోడా – పావు టీస్పూను, బత్తాయిరసం, నిమ్మరసం – రెండు చెంచాల చొప్పున, అన్నిరకాల డ్రైఫ్రూట్స్ – 50 గ్రాములు.
తయారుచేసే విధానం: ముందుగా మైదాలో బేకింగ్‌పౌడర్, వంటసోడా వేసి కలిపి, జల్లించుకుని పెట్టుకోవాలి. గిన్నెలో కోడిగుడ్ల సొనను తీసుకుని ఐదునిమిషాలు బాగా గిలకొట్టాలి. ఇందులో ఒక్కో పదార్థాన్నీ వేస్తూ ఐదు నిమిషాల చొప్పున గిలకొట్టాల్సి ఉంటుంది. ముందుగా వెన్నవేసి ఐదు నిమిషాలు గిలకొట్టాక చక్కెర పొడి, బత్తాయిరసం, నిమ్మరసం వేసుకుంటూ గిలకొట్టాలి. చివరగా జల్లించి పెట్టుకున్న మైదాను వేసినప్పుడు మాత్రం పది నిమిషాలు కలపాల్సి ఉంటుంది. బేక్ చేసే ముందు డ్రైఫ్రూట్స్ వేసి కలిపితే పిండి తయారైనట్లే. ఓవెన్‌ను 180 డిగ్రీల్లో ముందుగా వేడిచేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి లేదా వెన్న రాసిన బౌల్లోకి తీసుకుని బేక్ చేయాలి. కనీసం ఇరవై, ఇరవైఅయిదు నిమిషాలకు కేక్ తయారవుతుంది.
చాకో కేక్

కావల్సిన పదార్థాలు: మైదా- ఒకటిన్నర కప్పు, వంట సోడా – ఒకటిన్నర టీ స్పూను, ఉప్పు- పావు టీ స్పూను, గుడ్లు- రెండు, చక్కెర – ఒకటిన్నర కప్పు, నూనె- అర కప్పు, పెరుగు- ఒకటిన్నర కప్పు, వెనీలా ఎసెన్స్ – టీ స్పూను, కోకో పౌడర్ – కప్పు, కుకింగ్ చాకొలేట్ తురుము – 100 గ్రాములు. తయారుచేసే విధానం: ముందుగా ఓవెన్‌ను 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో వేడి చేయాలి. మైదాలో వంటసోడా, ఉప్పు కలిపి, జల్లించి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల మిశ్రమంలో చక్కెరను వేసి ఐదు నిమిషాల పాటు గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో కొంచెం నూనె కూడా పోసి మరి కొద్దిసేపు గిలకొట్టాలి. తర్వాత పెరుగు,
వెనీలా ఎసెన్స్‌ను , మైదా మిశ్రమాన్ని, కోకో పౌడర్‌ను కూడా వేసి కలపాలి. ఒకే సైజు ఉన్న రెండు గిన్నెల్లో నెయ్యి లేదా నూనె పూసి దానిలో కొద్దిగా మైదా పిండిని చల్లాలి. ఈ గిన్నెలో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ కొద్దిగా వేడిగా ఉండగానే కుకింగ్ చాకొలేట్‌ని దాని పైన పోసి చెక్క గరిటతో సమానంగా ఉండేలా సర్దాలి. రంగురంగుల స్ప్రింక్లర్స్‌ను పైన అందంగా అలంకరించాలి.
ఫ్రూట్ కేక్

కావల్సిన పదార్థాలు: గుడ్డు- నాలుగు, మైదాపిండి- 200గ్రాములు, పంచదార- 200గ్రాములు, బేకింగ్ పౌడర్- రెండు టీస్పూన్లు, అలంకరించేందుకు బాదం- 100గ్రాములు, క్రీమ్- 200మిల్లీలీటర్లు, పంచదార- కప్పు, తాజాపండ్ల ముక్కలు (ద్రాక్ష, పైనాపిల్, యాపిల్, నారింజ, దానిమ్మగింజలు)- మూడు కప్పులు.
తయారుచేసే విధానం: ముందుగా ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడుకి వేడిచేసి ఉంచాలి. కేక్ మిక్సింగ్ బౌల్లో గుడ్లసొన, మైదాపిండి, పంచదార, బేకింగ్ పౌడర్ వేసి బాగా గిలకొట్టాలి. మిశ్రమాన్ని రెండు వేర్వేరు టిన్నుల్లో పోసి సుమారు 35 నుంచి 45 నిమిషాలు బేక్ చేయాలి. ఆఫ్ చేశాక ఓ ఐదు నిమిషాలు అలానే ఉంచి తీసి చల్లార్చాలి. బాదం వేయించి చల్లారాక సన్నని ముక్కల్లా కోయాలి. క్రీమ్‌లో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఓ కేక్‌ను తీసుకుని తలకిందులుగా చేయాలి. దానిమీద క్రీమ్ పరిచినట్లుగా రాసి, సగం పండ్ల ముక్కలు పరచాలి. బాదం ముక్కలు చల్లాలి. తర్వాత మరో కేక్‌ను కూడా ముందులానే తీసుకుని దానిమీద ముందు మిగిలిన పండ్లముక్కలు పరిచి, బాదం చల్లి, వాటిమీద క్రీమ్ రాయాలి. ఇప్పుడు ఈ కేక్‌ను కిందకి తిప్పి, మొదటి కేక్‌మీద పెట్టి అదమాలి. తర్వాత మిగిలిన క్రీమ్‌ను కేక్ పైనా చుట్టూ పలుచని పొరలా పూసి పండ ్లముక్కలతో అందంగా అలంకరించాలి.
ఫ్లోర్‌లెస్ కేక్

కావల్సిన పదార్థాలు: చాక్లెట్ ముక్కలు – రెండుంబావు కప్పు, ఉప్పు కలపని వెన్న- ముప్పావుకప్పు, గుడ్లు – ఐదు, చక్కెర – కప్పు, వెనిల్లా ఎసెన్స్ – ఒకటిన్నర చెంచా, ఉప్పు – పావుచెంచా, చాక్లెట్ పొడి – పావుకప్పు(ఉండల్లా ఉంటే జల్లించుకోవాలి).
తయారుచేసే విధానం: ముందుగా ఓవెన్‌ని 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌పాన్ అడుగున కొద్దిగా వెన్న రాయాలి. దానిపై కొద్దిగా చాక్లెట్పొడిని చల్లాలి. తర్వాత చాక్లెట్ ముక్కలూ, వెన్నను గిన్నెలో తీసుకుని ఓవెన్లో కాసేపు ఉంచి కరిగించాలి. తర్వాత ఓవెన్లోనుంచి తీసి చల్లారనివ్వాలి. అందులోనే గుడ్లసొన, చక్కెర, వెనిల్లా, ఉప్పు, రెండు టేబుల్స్పూన్ల నీళ్లు కలపాలి. ఇది మెత్తగా అయ్యేవరకూ మిక్సీలో వేసి తిప్పాలి. అందులోనే చాక్లెట్‌పొడి కలిపి మరోసారి గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో ఉంచి నలబై అయిదు నిమిషాలసేపు బేక్ చేసి పక్కకు తీయాలి. అరగంటాగి పూర్తిగా చల్లారిందనుకుంటేనే కేక్‌ని కొంచెంసేపు ఫ్రిజ్‌లో ఉంచి తినాలి.
పైనాపిల్ కేక్

కావల్సిన పదార్థాలు: వెనీలా స్పాంజ్ కేక్ – ఒకటి, పంచదార నీళ్లు – అరకప్పు, పైనాపిల్ ఎసెన్స్ – ఆరు చుక్కలు, పైనాపిల్ ముక్కలు – నాలుగు, కేక్ క్రీము – నాలుగు టీ స్పూన్లు, చెర్రీస్ – సరిపడా.
తయారుచేసే విధానం: స్పాంజ్ కేక్ తీసుకుని కింది, పై భాగాలను కట్ చేసి తీసేయాలి. తర్వాత కేకుని మూడు పొరలుగా కట్ చేసుకోవాలి. పంచదార నీళ్లలో పైనాపిల్ ఎసెన్స్ కలుపుకోవాలి. ఒక్కో పొరపై మూడు టీ స్పూన్ల పంచదార నీళ్లు పోయాలి. తర్వాత క్రీము రాయాలి. వీటిని ఒకదానిపై ఒకటి పెట్టుకుని సాండ్‌విచ్‌లా చేసుకోవాలి. ఈ కేకుని మనకి నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని చెర్రీలు, పైనాపిల్ ముక్కలతో అలంకరించి ఓ పావుగంట ఫ్రిజ్‌లో పెట్టి తినాలి.
తగుమోతాదులో తీసుకోవాలి
కేక్స్ శరీరానికి చాలా శక్తినిస్తాయి. కేక్స్‌లో గుడ్డు ఉపయోగించడం వల్ల క్వాలిటీ ప్రొటీన్ కూడా తోడవుతుంది. వీటిలో ఎక్కువగా ప్లేవర్స్ ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా డైరెక్ట్‌గా కూడా ప్రూట్స్‌ను ఉపయోగించవచ్చు. వీటిలో ఎక్కువగా చక్కెర, మైదాలాంటి కొవ్వు పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టి
తగుమోతాదులోనే తీసుకోవాలి.