భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
భువనేశ్వర్: ఒడిశాలోని గోపాల్పూర్ ఎయిర్‌డిఫెన్స్ దళానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ‘ప్రెసిడెంట్ కలర్స్’ అవార్డును ప్రదానం చేశారు. రెండు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా ముందుగా గోపాల్పూర్ ఎయిర్‌డిఫెన్స్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. దేశ భద్రతకు దళాలు సహకారం అందించినందుకు ఆయా రెజిమెంట్‌కు ఇచ్చే అత్యున్నత గౌరవమే ‘ప్రెసిడెంట్ కలర్స్’ . భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడటంలో సాయుధబలగాలతో పాటు, ఎయిర్ డిఫెన్స్ దళాలు బాగా క షి చేస్తున్నాయన్నారు. ఈ దళం దేశ భద్రతలో ఎప్పుడూ ముందుంటుందని ప్రశంసించారు. రెండో ప్రపంచ యుద్ద సమయంలో ఈ దళ సైనికులు పలు ఆపరేషన్స్‌లో విజయవంతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అప్పుడు వారు పలు ధైర్య,సాహసాలు ప్రదర్శించి పురస్కారాలు అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి సైనిక వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారత ఆర్మీ అధిపతి బిపిన్ రావత్‌తో పాటు, ఒడిశా గవర్నర్ గణేషి లాల్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌లు హాజరయ్యారు. భారత భద్రతా విభాగంలో ఎయిర్‌డిఫెన్స్ దళం 1940 నుంచి ఉంది.. 1994లో ప్రభుత్వం దీనిని ప్రత్యేక దళంగా ప్రకటించింది. 1971 తూర్పు పాకిస్థాన్ విముక్తి సమయంలో ఎయిర్‌డిఫెన్స్ దళం రెండు అశోక చక్ర, రెండు కీర్తి చక్ర, 20 వీర్ చక్ర, తొమ్మిది శౌర్య చక్ర, 113 సేన పతకాలు పొందింది. 2700 ఎకరాల్లో ఏర్పాటైన గోపాల్పూర్ ఎయిర్ డిఫెన్స్ కేంద్రం ఆ దళానికి శిక్షణ కేంద్రంగా నడుస్తోంది.