అక్టోబర్ 21న తదుపరి విచారణ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు శనివారంనాడు వాయిదా వేసింది. ఇరు పక్షాల వారు వాయిదా కోరడంతో తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎంఎం) సమర్ విశాల్ వాయిదా వేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలు కాంగ్రెస్ నేతలు ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని శనివారం క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాది ఆర్ చీమా గత ఆగస్టు 30న సుబ్రహ్మణ స్వామిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు మోసానికి పాల్పడగా, కార్యకర్తలు బాధితులయ్యారని న్యాయవాది అడిగిన ఓ ప్రశ్నకు స్వామి అప్పట్లో సమాధానమిచ్చారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, తదితరులు మోసం, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 2012లో స్వామి కేసు వేశారు. నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ ఓనర్ అయిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌కు రూ.90.25 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిందని స్వామి అభియోగంగా ఉంది.