ఉగ్రవాదంపై ప్రధాని మోదీ
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. తన అధ్భుత ప్రసంగంలో భాగంగా 3వేల ఏళ్లనాటి మాటను గుర్తుకు తెచ్చారు. తమిళనాడుకు చెందిన కవి, తత్వవేత్త కణియన్ పుంగుంద్రనార్ చెప్పిన ‘మనం అందరికీ, అన్ని ప్రాంతాలకు చెందినవాళ్లం(యాదుమ్ ఒరే యావారుమ్ కెళిర్)’ అని అర్థం వచ్చే మాటను మోదీ తన ప్రసంగంలో ఉపయోగించారు. అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి ప్రపంచాభివద్ధికి తోడ్పడాలన్నది మోదీ ఉద్దేశం. ఉగ్రవాదంపై కలిసి పోరాడాలన్న ఆలోచనతో మోదీ..కణియన్ మాటను గుర్తు చేసుకున్నారు.
‘3వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఒక మహాకవి ఉండేవారు. ఆయన పేరు కణియన్ పుంగుంద్రనార్. ఆయన తమిళకవి. ఆయన ‘యాదుమ్ ఒరే యావారుమ్ కెళిర్’ అనే మాట చెప్పారు. ఈ మాటలో ఎంతో అర్థం దాగి ఉంది. అందరం ఐకమత్యంతో ఉండి సమస్యలపై పోరాడాలని దీని ఉద్దేశం’ అని మోదీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. కణియన్ ఆరో శతాబ్దానికి చెందిన కవి. తమిళనాడులోని శివగంగ జిల్లా మహబాలన్పట్టి ఆయన స్వగ్రామం. ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్యల విషయంలో అందరూ ఐక్యంగా పోరాడాలి. అందుకే ఆయన అన్ని ప్రాంతాలూ అందరికీ చెందినవే అనే మాట చెప్పారు.