హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్: కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నియామక ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారని చెప్పారు. తప్పులు జరిగాయని కొందరు ఫెయిలైన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నరని హోంమంత్రి ఆరోపించారు. ఒకవేళ పొరపాట్లు జరిగినట్లు ఆధారాలు ఉంటే విచారణ జరిపిస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో ఎవరిపైనా అక్రమ కేసులు బనాయించలేదని.. హోంమంత్రి పేర్కొన్నారు. ఏదైనా గొడవ జరిగితే తెరాసతో పాటు ఎవరిపైనైనా కేసులు నమోదవుతాయన్నారు. హుజూర్ నగర్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సర్పంచులను అరెస్టు చేసినట్లు తనకు సమాచారం లేదని చెప్పారు. అజారుద్దీన్ తెరాసలో చేరనున్నారన్న సమచారం తనకు తెలియదని, తెరాసలో ఎంతో మంది చేరుతుంటారన్నారు. రోహింగ్యాలు దేశమంతటా ఉన్నారని.. ప్రత్యేకంగా తెలంగాణలో ఆశ్రయం ఇస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని హోంమంత్రి పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ తర్వాత హైదరాబాద్‌లోనే రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారని, వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హోంమంత్రి ఈ విధంగా స్పందించడం గమనార్హం.
హజ్ యాత్రలో గాయపడిన వ్యక్తికి సాయం
హజ్ యాత్రలో గాయపడిన రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సౌదీ ప్రభుత్వం నుంచి పరిహారం అందింది. బాధితుడు ముజీబ్‌కు హోంమంత్రి మహమూద్ అలీ చెక్‌ను అందజేశారు. 2015లో హజ్ యాత్రలో జరిగిన ప్రమాదంలో ముజీబ్ గాయపడ్డారు. చికిత్స అనంతరం నగరానికి వచ్చారు. ఆయనకు సౌదీ ప్రభుత్వం రూ.95లక్షల చెక్కును అందించినట్లు మహమూద్ అలీ తెలిపారు.