దసరా ‘కిక్కు’ హుళక్కి!

భారీగా పెంచేసిన లైసెన్స్‌ ఫీజు: ఏపీ పాలసీపై మొగ్గు
  • -ప్రస్తుతం ఉన్న 2,216 వైన్‌ షాపులు యథాతథం
  • -నవంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీ
  • -రేపటితో ముగియనున్న ఎక్సైజ్‌ గడువు
  • – మొదలైన బతుకమ్మ, దసరా పండుగలు
  • -ఉన్న స్టాకుకే పరిమితమవుతున్న నిర్వాహకులు
  • -ప్రభుత్వమే వైన్‌షాపుల నిర్వహణకు కసరత్తు
  • -పట్టణాలలో లైసెన్స్‌కు రూ.5 లక్షలు
  • -గ్రామాలలో లైసెన్స్‌కు రూ. 4 లక్షలు

కొత్త మద్యం పాలసీ పై తెలంగాణ సర్కార్‌ దష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను మరింత పెంచడంతోపాటు, భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండేళ్ల ఎక్సైజ్‌ పాలసీ పూర్తికావస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీపై దష్టి సారించింది. సెప్టెంబర్‌ 30న ఎక్సైజ్‌ ఇయర్‌ పూర్తవుతుంది. మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది.కొత్తగా దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దానికి అనుగుణంగా కొత్త పాలసీని ప్రకటించనున్నారు.
హైదరాబాద్‌:
వైన్‌ షాప్స్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ సోమేశ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 2,216 వైన్‌ షాపులు యథాతథంగా నడవనున్నాయి. వాస్తవానికి ఈ నెలాఖరుతో మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు ముగియాల్సి ఉంది. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ పాత లైసెన్స్‌ల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్‌. నగరశివారు ప్రాంతాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎక్సైజ్‌ పాలసీలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్‌లుగా ప్రకటించిన నేపథ్యంలో పాలసీలో మార్పులు వచ్చే అవకాశం ఉందని కొందరు అధికారులు తెలిపారు. ఈసారి ఎక్సైజ్‌ పాలసీ ఏ విధంగా ఉంటుందన్న దానిపై మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది.
నూతన మద్యం విధానానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అధికారుల నివేదికను పరిశీలించిన ఎక్సైజ్‌ శాఖ.. మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువును పొడిగించింది. అక్టోబరు 31 వరకు అనుమతులను పొడిగిస్తూ మద్యం అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. ఇక నవంబరు 1 నుంచి కొత్త మద్యం పాలిసీ అమల్లోకి వస్తుంది. లాటరీ పద్దతిలో కొత్త వారిని ఎంపిక చేస్తారు. మరో వారం రోజుల్లోనే దసరా పండుగ వస్తోంది. దసరా అంటేనే తాగడం.. తినడం.. మద్యం – మాంసం జోరుగా క్రయవిక్రయాలు సాగుతాయి.. ఇక తెలంగాణ ఆరాధ్య పండుగ బతుకమ్మ కూడా దసరాకు రెండు రోజుల ముందు ఉండడంతో ఊరు వాడా అంతా విందు వినోదాలతో మునగడం ఖాయం..
అయితే ఈ దసరా పండుగకు మద్యం కొరత తెలంగాణను పట్టి పీడించడం ఖాయమంటున్నారు. తెలంగాణ మద్యం షాపుల లైసెన్స్‌ గడువు సెప్టెంబర్‌ 30తో ముగియబోతోంది. కొత్త మద్యం పాలసీని తెలంగాణ సర్కారు ఇంకా ప్రకటించలేదు. ఏపీ లో జగన్‌ తెచ్చిన ‘సర్కారీ వైన్‌ షాపుల’ను తెలంగాణలో తెచ్చేందుకు కేసీఆర్‌ సర్కారు ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. అందుకే తాజాగా మద్యం షాపుల లైసెన్స్‌ ను తెలంగాణ సర్కారు మరో నెల రోజులు అంటే అక్టోబర్‌ 30వరకు పొడిగించింది. ఇందుకోసం ఈ నెలకు భారీగా లైసెన్స్‌ ఫీజును పెట్టింది. నెలకోసం పట్టణాల్లో 5 లక్షల వరకూ గ్రామాల్లో 4 లక్షలలోపు లైసెన్స్‌ ఫీజును పెంచింది. హైదరాబాద్‌లో – ఇతర నగరాల్లో అయితే భారీగా ఉంది. ఈ ఫీజు నెలరోజుల్లో తిరిగి రావడం కష్టమేనని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు.
అయితే నెలరోజుల్లో ముగిసే మద్యం షాపుల లైసెన్స్‌ కోసం భారీగా ఫీజును చెల్లించడానికి మద్యం షాపుల నిర్వాహకులు ఉత్సాహం చూపించడం లేదట.. ఎలాగూ తెలంగాణ సర్కారు నవంబర్‌ నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో వైన్‌ షాపులు పెట్టేందుకు రెడీ కావడంతో.. ఉన్న స్టాకును అమ్మేసి ఊరుకుందామనే ఆలోచనలో మద్యం షాపు నిర్వాహకులు ఉన్నారట.. అందుకే ఎవరూ మద్యం కొనుగోలుకు లైసెన్స్‌ ఫీజు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదట.. దీంతో మద్యం నిల్వలు అయిపోయాక తెలంగాణలో షాపులు కట్టేస్తారన్నమాట.. కొత్తగా మద్యం కొనరు.. లైసెన్స్‌ ఫీజు కట్టరు.
ఈ పరిణామంతో తెలంగాణలో మద్యం కొరత అనివార్యం కానుంది. మరో వారానికి సరిపడా మాత్రమే మద్యం నిల్వలు వ్యాపారుల వద్ద ఉన్నాయట.. మద్యం వ్యాపారులు నెల ఫీజు కట్టకుండా మద్యం కొనకపోతే వైన్‌ షాపులలో మద్యం దొరకదు. పండుగ పూట తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మద్యం కొరత వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు మద్యం షాపు యజమానులతో నెలరోజులకు లైసెన్స్‌ ఫీజు కట్టాలని చర్చలు జరుపుతున్నారట.. కానీ మద్యం వ్యాపారులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది.
తెలంగాణలో కూడా ప్రభుత్వమే మద్యం షాపులను నడిపే ఆలోచన చేస్తోందని వార్తలు వచ్చాయి.ఎపిలో ఇప్పటికే ప్రభుత్వం ఈ షాపులను నిర్వహిస్తోంది. ఇదే మార్గంలో వెళితే ఎలా ఉంటందన్నద దానిపై తెలంగాణ ప్రభుత్వం అద్యయనం ఆరంబించింది. ప్రభుత్వ అధీనంలో షాపులను నడిపితే లాభాలు ఏ మేరకు ఉంటాయి? ఇబ్బందులేమిటి? ఎంతమంది సిబ్బంది అవసరం? కొత్తగా నియామకాలు ఏమైనా చేపట్టాలా? వంటి అంశాలను అధ్యయనం చేయాలని సూచించింది. పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు దీనిపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌ కూడా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే నడిపితే వచ్చే లాభనష్టాలపై అధ్యయనం మొదలైంది. ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నారు.అందువల్లే ప్రస్తుతానికి నెల రోజుల పాటు అదనంగా లైసెన్సులు ప్రస్తుత షాపులకు పొడిగించారని భావిస్తున్నారు.
రేపటితో ముగియనున్న ఎక్సైజ్‌ గడువు..!
గతంలో ఏడాదికోసారి కొత్త లైసెన్స్‌ ఇచ్చే విధానం ఉండేది. షాపులను వేలం వేసేవారు. ఎక్కువ ధర కోట్‌ చేసిన వారికి దుకాణాలను కేటాయించేవారు. ఈ పద్ధతిలో చాలామంది వ్యాపారులు రింగ్‌ అయి తమకు నచ్చినచోట దుకాణాలను దక్కించుకునే వారు. దీంతో మద్యం వ్యాపారుల మధ్య గొడవలకు ఆస్కారం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. 2016-17, 2018-19 సంబంధించి రెండేళ్లకు లైసెన్స్‌ ఫీజు వసూలు విధానం అమలు చేస్తోంది. జంటనగరాల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్‌లకు కలిపి హైదరాబాద్‌ జోన్‌లో 6, సికింద్రాబాద్‌ జోన్‌లో 5 ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్ల పరిధుల్లో 199 మద్యం షాపులు ఉన్నాయి. 250 వరకు బార్‌లు ఉన్నాయి. కొత్త పాలసీలో భాగంగా ముందుగా మద్యం దుకాణాలనే కేటాయించేందుకు ఎక్సైజ్‌ అధికారులు సన్నద్దమవుతున్నారు.
ఆదాయం పెంచుకునే దిశగా సన్నాహాలు..
కొత్త ఎక్జ్సైజ్‌ పాలసీలో భాగంగా లైసెన్స్‌ కేటాయింపులో ఈసారి కూడా పారదర్శకంగానే వ్యవహరించనున్నారు. గతంలో మాదిరిగా వేలం విధానం కాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుకాణాలన్నింటికీ ఒకే ధరను నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఒక్కో దుకాణానికి 1.8 కోట్ల రూపాయలు నిర్ణయించి రెండేళ్లకు 2.16 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో లైసెన్స్‌ ఫీజుల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి గతంలో కంటే ఈ రెండేళ్లలో మద్యంపై పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. జంటనగరాల్లో రోజుకు 25 నుంచి 30 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం. అంటే నెలకు 75 కోట్ల రూపాయలు వ్యాపారం, ఏడాదికి దాదాపు 900 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
దుకాణాల కోసం పెరగనున్న పోటీ..
దుకాణాల కోసం పెరగనున్న పోటీ..! డ్రా విధానంతో కేటాయింపులు..!!
ఇవి కాకుండా మద్యం వ్యాపారుల నుంచి వసూలుచేసే లైసెన్స్‌ పీజుల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈసారి కూడా షాపుల కేటాయింపు, లైసెన్స్‌ ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జంటనగరాల్లో మద్యం దుకాణాల కోసం ఈసారి పోటీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఒక్కో దుకాణానికి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీపడుతున్నారు. బాగా వ్యాపారం జరిగే ప్రాంతాల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. గతంలో వేలం వేస్తే ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి షాపులను కేటాయించేవారు. మారిన విధానంలో ఒక దుకాణానికి ముందే ధర నిర్ణయిస్తారు. ఈ ధరకు లైసెన్స్‌ తీసుకునే వారు ఎక్కువమంది ఉంటే లాటరీ పద్ధతిలో వారికి షాపు కేటాయిస్తారు. గతంలో వేలం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తే ఈసారి లైసెన్స్‌ ఫీజును పెంచడం ద్వారా మరింత అధిక ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
శివారులోని పంచాయతీలు, మునిసిపాలిటీల పరిధిలో లైసెన్స్‌ ఫీజును ఏడాదికి 45 లక్షలు రూపాయలుగా నిర్ణయించారు. తాజాగా శివారు ప్రాంతాల్లోని మునిసిపాలిటీలు, పంచాయతీలను కార్పొరేషన్‌లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే శివారు ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజులు పెరుగుతాయని కూడా చర్చ జరుగుతోంది.