హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే కోటిన్నరకు పైగా మొక్కలు నాటారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో మంత్రులు సి. మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హరితహారం కార్యక్రమంలో పాల్గొని, ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలనీ, అలా చేసినపుడు మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మంత్రి అన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అని తెలిపిన మంత్రి, చెట్లు ఉంటేనే మానవాలికి భవిష్యత్ ఉంటుందన్నారు. మానవ మనుగడకు, వాతావరణ సమతుల్యతకు చెట్లే ప్రధాన కారణమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం వి రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, ఎంపీపీ పద్మజ, జెడ్పీటీసీ శైలజ, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.