నాసిరకం ‘కాసు’పత్రులు

నాణ్యతలేని మాత్రలు
అధిక కమీషన్లకు ఆశపడి పనికిరాని కంపెనీల మందులు రాస్తున్న వైద్యులు
  • సొంత మెడికల్‌ హాల్‌ నిర్వహిస్తున్న వైద్యులు
  • రోగులకు రాసిచ్చే మందులు దొరికేది అక్కడే..
  • వేరే కంపెనీ మందులను అనుమతించని వైద్యులు
  • అధిక కమీషన్‌ ముట్టే కంపెనీలతో ఒప్పందం
  • జనరిక్‌ మందుల ఊసే ఎత్తని వైద్యులు
  • ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న డాక్టర్లు
  • కొన్ని సార్లు వికటిస్తున్న మాత్రలు
  • రోగుల ప్రాణాలతో చెలగాటం

హైదరాబాద్‌:
వైద్యో నారాయనో హరిః.. అన్న నమ్మకం పోయి వైద్యుల వద్దకు వెళ్తే ప్రాణాలు హరీ మనక తప్పదనే రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు వైద్యులు. ప్రత్యక్ష దైవంగా భావించే వైద్యులే కమిషన్‌లకు కక్కుర్తిపడి పనికిరాని కంపెనీలకు చెందిన మందులను రోగులకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు కార్పొరేట్‌ వైద్యశాలల్లో సైతం పనికిరాని మందులను తమ సొంత మెడికల్‌ షాపుల్లో ఉంచి వాటినే ప్రిస్కిప్షన్‌లో రాస్తుండటంతో చేసేదిలేక ప్రజలు వీటినే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లురాసే కంపెనీల మందులు బయట ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడుతుండటంతో రోగులు అధిక ధరలకు వారి వద్దే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మంచి కంపెనీల మందుల కంటే నాసిరకం మందుల కంపెనీలు వైద్యులకు అధిక కమీషన్లు ఎరగా చూపి తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారు.
రోగుల ప్రయోజనాలను పక్కన బెట్టి ధనార్జనే ధ్యేయంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చివరకు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్‌ల వద్ద కూడా కమీషన్లకు అలవాటు పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు వైద్యులు కనీస సౌకర్యాలు కూడా లేని ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్‌లకు రోగులను పంపుతుండటంతో వ్యాధి నిర్ధారణ కూడా సరిగా చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో ఏదో ఒకటి రాసి వీరు పంపడం అది చూసి తూతూమంత్రంగా మందులు రాసివ్వడం కొందరు వైద్యులకు నిత్యకత్యంగా మారింది. అసలు వ్యాధి నిర్ధారించలేక పోవడంతో జబ్బు తగ్గక రోగులు ఆసుపత్రుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనికితోడు వైద్యులకు కమీషన్‌లు ఇవ్వాలనే కారణంతో ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఆ భారాన్ని కూడా రోగులపై మోపుతుండటంతో ఆసుపత్రులకు వెళ్లాలంటే హడలిపోతున్నారు.
జనరిక్‌ మందుల ఊసే ఎత్తని వైద్యులు..
రోగులకు అయ్యే వైద్యం ఖర్చులో 60 శాతం వరకూ మందులే ఉంటాయి. అలాంటి మందుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనరిక్‌ మందుల దుకాణాలను ప్రవేశపెట్టింది. ఈ మందులను రోగులకు అలావాటు చేసి ఆర్ధిక భారాన్ని తగ్గించాలని వైద్యులకూ సూచించింది. ఒంగోలు నగరంలో కూడా నాలుగైదు జనరిక్‌ మందుల దుకాణాలు ఉన్నప్పటికీ ఇక్కడి వైద్యులు మాత్రం వీటి ఊసే ఎత్తడం లేదు. జనరిక్‌ మందులను రాయడం వల్ల తమకు ఒరిగేదేమీ లేకపోవడంతో వాటిని రోగులకు రాయకపోగా ఎవరైనా అడిగినప్పటికీ అవి పని చేయవంటూ చెప్పడం చూస్తుంటే వీరు ఏ స్థాయికి దిగజారారో అర్ధం చేసుకోవచ్చు. కంపెనీ ప్రతినిధులు తమ మందులను రోగులకు రాయడంతో వైద్యులకు ఆరునెలలు లేదా ఏడాదికొకసారి కమీషన్లను వారి బంధువుల పేరుతో ఖాతాల్లో జమ చేస్తున్నారు.
రోగులకు నాసిరకం మందుల కంపెనీలను అంటగడుతూ ప్రతిఫలంగా కొందరు వైద్యులు ఫ్యామిలీలతో ఫారెన్‌ ట్రిప్పులకు వెళ్తుండటం చూస్తుంటే మందుల కంపెనీలు వైద్యులను బుట్టలో వేసుకున్నారని చెప్పకనే చెప్పవచ్చు. ఇంతే కాకుండా వైద్యులకు ప్రతి నెలా ఖరీదైన బహుమతులు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మందుల కంపెనీల వద్ద కమీషన్‌లు తీసుకుని రోగులకు ఆ కంపెనీ మందులను అంటగట్టే సంస్క తి అనైతికమని ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎంసీఐ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇవేమీ అవినీతి వైద్యుల చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా వైద్యులు ఆలోచించి రోగుల ప్రాణాలతో చెలగాట మాడటం మానుకోవాలని పలువురు కోరుతున్నారు. చిన్నపిల్లలకు పంపిణీ చేసే మందుల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా 30 లక్షల నాసిరకం ‘ఆల్బెండజోల్‌’ గోలీలను జిల్లాలకు పంపించారు. చివరి నిమిషంలో ఈ విషయం బయటపడటంతో గురువారం జరగాల్సిన పంపిణీని నిలిపివేశారు. ఆ గోలీలన్నింటినీ వెనక్కి తెప్పిస్తున్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఏటా రెండు సార్లు..
దేశవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో ఒకటి నుంచి 19 ఏండ్ల వయసున్న వారిలో నులి పురుగుల నివారణ కోసం ‘ఆల్బెండజోల్‌’ గోలీలను పంపిణీ చేస్తారు. ఎంతమందికి పంపిణీ చేయాలి, ఎన్ని గోలీలు కావాలన్నది ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేరకు నివేదిక రూపొందించి మందుల కొనుగోలు కోసం తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఐడీసీ)కి వంద రోజుల ముందు ఇండెంట్‌ ఇస్తారు. ఆ మేరకు టీఎస్‌ఎంఐడీసీ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి, సరఫరా చేస్తుంది. అయితే ఇటీవల ఆగస్టు 8న ఈ గోలీలు పంపిణీ చేశారు. కానీ అధికారులు ఇండెంట్‌? పెట్టడంలో ఆలస్యం చేశారు. 1,17,16,079 గోలీల కొనుగోలుకు జూన్‌? 12న ఇండెంట్‌ పెట్టారు. అదే నెల 17న టీఎస్‌ఎంఐడీసీ టెండర్ల ప్రక్రియను ప్రారంభించి.. 29న ఓ కంపెనీని ఖరారు చేసింది. కానీ ట్యాబ్లెట్లు సరఫరా చేయలేమంటూ పది రోజులకే ఆ కంపెనీ చేతులెత్తేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఒడిషా డ్రగ్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఓడీసీఎల్‌)’ ట్యాబ్లెట్ల పంపిణీకి ముందుకొచ్చింది. ఒక్కో బ్యాచ్‌కు 10 నుంచి 12 లక్షల ట్యాబ్లెట్ల చొప్పున 8 బ్యాచ్‌లుగా ఎంఐడీసీ జిల్లాలకు సరఫరా చేసింది.
చెకింగ్‌లో లోపం..
ట్యాబ్లెట్ల నాణ్యత పరీక్ష బాధ్యతను అల్కాటెక్‌ అనే థర్డ్‌ పార్టీ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. హైదరాబాద్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డీసీఏ) సైతం వాటిని పరీక్షించింది. మొత్తం ఎనిమిది బ్యాచ్‌లకుగాను మూడు బ్యాచ్‌ల గోలీలు నాసిరకంగా ఉన్నట్టు డీసీఏ బుధవారం తేల్చింది. దీంతో ఆయా బ్యాచ్‌ల ట్యాబ్లెట్లు వెళ్లిన 13 జిల్లాల్లో పంపిణీ ఆపేయాలంటూ బుధవారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాణ్యతా పరీక్షలు చేయించకుండానే గోలీలు ఎలా సరఫరా చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ గోలీలు వేస్తే.. పిల్లలకు జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ట్యాబ్లెట్లు ప్రమాణాల ప్రకారం ఉన్నట్టు అల్కాటెక్‌ కంపెనీ నివేదిక ఇవ్వడంతోనే జిల్లాలకు సరఫరా చేశామని టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. డిజల్యూషన్‌ టెస్ట్‌లో ఫెయిలైనట్టు డీసీఏ తేల్చడంతో పంపిణీ ఆపామని, ఆ నిబంధన ఈ ఏడాదే కొత్తగా తెచ్చారని తెలిపారు. డిజల్యూషన్‌ అవకపోతే ట్యాట్లెట్ల ఎఫెక్ట్‌ తక్కువగా ఉంటుందని, అంతేతప్ప ప్రమాదమేమీ ఉండదని అన్నారు.