రూ.6.53 లక్షల జరిమానా

ట్రక్కు యజమానికి ఒడిశా పోలీసుల ఝలక్‌

భువనేశ్వర్‌: ట్రాఫిక్‌ జరిమానాల పుణ్యమాని ప్రజల సంపాదన గురించి పక్కన పెడితే వారి జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించారంటూ దిలీప్‌ కర్తా అనే డ్రైవర్‌కు ఏకంగా రూ.6.53లక్షల జరిమానా విధించారు. మొత్తం ఏడు నియమాల ఉల్లంఘనలకు గానూ ఈయనకు ఒడిశాలోని సాంబాల్‌పూర్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఇంత మొత్తంలో చలానా జారీ చేశారు. నాగాలాండ్‌ రాష్ట్రానికి చెందిన ఆ వాహనానికి వేసిన జరిమానాను చూసి ట్రక్కు ఓనర్‌ శైలేశ్‌ శంకర్‌ నోరెళ్లబెట్టాడు. గత ఐదేళ్లుగా రోడ్డు ట్యాక్స్‌ కట్టనందుకు రూ.6,40,500 జరిమానా వేశారు. వస్తువులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు, తప్పు అంగీకరించనందుకు తదితర కారణాలు చూపి రూ.6.53లక్షలు వసూలు చేశారు. అయితే ఇదంతా కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత అనుకుంటే పొరపాటే.ఆగస్టు 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కనుక పట్టుబడి ఉంటే ట్రక్కు యజమానికి తడిసి మోపెడయ్యేదే.