తెలంగాణలో జీతాలు ఆలస్యం..సంక్షేమానికి గ్రహణం..కొత్త పథకాలకు మంగళం
- -ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్
- -సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనున్న గడువు
- -సెప్టెంబర్ నెలాఖరుకు బడ్జెట్ సమావేశాలు
- -త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న సీఎం
- -రైతుబంధు, కళ్యాణలక్ష్మి పథకాలకు నిధులు కరువు
- -పెండింగ్ బిల్లులతో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
- -బడ్జెట్ నిధులు లేక పడకేసిన పాలన
- -ఆర్థిక శాఖలో అన్నీ పెండింగ్ బిల్లులే
- -కొత్త ఉద్యోగాల ఊసే లేదు
- -నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
హైదరాబాద్:
తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల చివరి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. ఈ గడువు కంటే ముందే మిగిలిన ఆరు నెలల కాలానికి (మార్చి 2020 వరకు) వర్తించేలా పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలను జరపనున్నారు. ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వం భావించింది. పురపాలక ఎన్నికలు వెంటనే జరపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవాలున్నాయి. వాటి తర్వాతే బడ్జెట్ సమావేశాలు జరపాలనుకుంటున్నారు. దీనికి వచ్చే నెల చివరి వారమే అనువైందిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది
అన్ని శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదనలు సమీక్షించారు. ఈ ఏడాది సంబంధించిన వివిధ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలను వెంటనే ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్ర బడ్జెట్ను ద ష్టిలో ఉంచుకోవాలి. బడ్జెట్ ప్రతిపాదనలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సమీక్షలో వివరించారు.
బడ్జెట్ ప్రతి రాష్ట్రానికి వెన్నుముక.. వచ్చే ఆదాయమెంత, చేస్తున్న ఖర్చెంత, అందులో మిగులెంత, లోటెంత అన్ని లెక్కల విరీద లెక్కల వేసుకునే శాఖనే ఆర్థికశాఖ.. ఎనిమిది నెలలు పూర్తౌట తొమ్మిది నెలల కూడా దాటిపోతుంది. కాని ఇప్పటి వరకు ఆర్థికశాఖకు మంత్రి లేడు. పూర్తి స్థాయి బడ్జెట్ పెడదామనే ఆలోచన లేదు. అడిగే వారు, ప్రశ్నించే వారు లేనప్పుడు రాజు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతుందంట. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నదీ అదే.. ప్రజలకు పనికొచ్చే అసలు పనిని వదిలేసి, మరేదో పనిని ముందేసినట్లుగానే సాగుతోంది పాలన. ఎంతోమంది ఉద్యోగులు కొన్ని నెలల నుంచి జీతాలు రాక తల్లడిల్లుతున్నారు. కెసిఆర్ కిట్ కింద బాలింతలకు డబ్బులు రాక సంవత్సరాలు దాటుతోంది. కళ్యాణ లక్ష్మీ ఎప్పుడో పడకేసిందీ. మరెన్నో పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ బడ్జెట్ ప్రవేశపెట్టి పాలన సాగిస్తుంటే మనం మాత్రం సంవత్సరం దగ్గరికొస్తున్నా ప్రజల పథకాలపై, బడ్జెట్ రూపకల్పనపై ఆలస్యమవుతోందనే అధికారపక్షానికి ఆందోళన లేదు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులన్నీ మూగపోయినప్పుడు అధికారపక్షం తనకు నచ్చినప్పుడే, చేసినప్పుడే అన్న చందంగా మారిపోయింది..
ప్రతి పాలనలో ప్రశ్నించే గొంతులుండాలి. ప్రజల సమస్యలపై అడుగడుగునా ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం ఉండాలి. ఈ రెండూ అధికారపక్షంతో విలీనమైనప్పుడు లేదా బలహీనమైనప్పుడు అక్కడ పాలకులు చెప్పినట్టే, వారికి నచ్చినట్టే జరుగుతోంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు నిధులు లేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. చదివిన చదువుకు ఉద్యోగం రాక బతకడం కోసం చిన్నచితకా ఉద్యోగం చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు రాక సంవత్సరాలవుతోంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందక నెలలు అవుతోంది. ఎంతో గొప్పగా ప్రవేశపెట్టిన పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవాల్సిన యంత్రాంగం తమ పనికాదన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ప్రజల అభివ ద్దికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడుతామనే ఆలోచనే మన పాలకులకు రావడం లేదు.
పూర్తిస్థాయి పద్దు లేని తెలంగాణ
తెలంగాణలో పూర్తిస్థాయి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు..? పాత పథకాలను ఎప్పుడు పూర్తి చేస్తారు. కొత్త పథకాలను ఎప్పుడు ప్రవేశపెడుతారు. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినా, అది కేవలం ఓటాన్ అకౌంట్ మాత్రమే. ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది ఉంది. జులైలోగానే బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. పైగా తెలంగాణలో ప్రస్తుతం ఆర్థిక శాఖకు మంత్రి లేరు. ప్రస్తుతం ఆ శాఖను సీఎం కేసీఆర్నే పర్యవేక్షిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ఆయనే ప్రవేశపెట్టారు. దీంతో ఆయనే మరోసారి బడ్జెట్ ప్రవేశపెడతారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగి ఆర్థిక శాఖ కొత్త మంత్రి వచ్చే పరిస్థితి లేదు.
ఎందుకంత తాత్సారం?
పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వం కూడా నెలల తరబడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుదామనే ఆలోచన ఎందుకు రావడం లేదు. అప్పటికే నెలల తరబడి ఆందోళన చేస్తున్న ఎర్రజొన్న, పసుపురైతుల ముఖం కూడా చూడలేదు. రాష్ట్రంలో ప్రశ్నించే వారు లేరని ఎవరూ ఏవిరీ చేయలేరన్న ధోరణి ప్రదర్శిస్తున్నారనే ఆరోఫణలున్నాయి. మల్లన్నసాగర్ రైతులకు చెల్లించవల్సిన పరిహారం విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రజల తీర్పును పక్కనబెట్టి ప్రతిపక్షాన్ని ఖాళీ చేయటం మీదనే దష్టిసారిస్తున్నారని తెలుస్తోంది. ప్రజాసమస్యలు పక్కనబెట్టి ‘ఆపరేషన్ ఆకర్ష్’ పైనే ప్రత్యేక దష్టి కేంద్రీకరించారు. శాసనసభ ప్రజా ప్రతినిధుల సభగా కాకుండా, టీఆర్ఎస్ శాసనసభా పక్షంగానే ఉండాలన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చట్టసభలను నామమాత్ర స్థాయికి దిగజార్చారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు శాసనసభ, మండలి సమావేశాలు జరిగాయనిపిస్తున్నారు. ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారం వెతికే చట్టసభలుగా నడపడానికి సిద్ధంగాలేరని తెలిసిపోతుంది. అన్ని విషయాల్లోనూ ఏకపక్ష ధోరణే ప్రధానంగా కనిపిస్తోంది..
ఉద్యోగ పోస్టుల భర్తీపై ప్రకటనే లేదు..
ఏడాదిలో లక్షా ఏడువేల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్న పాలకులు దాదాపు 8 నెలలు గడిచినా అమలు చేయడం లేదు. శాసనసభ ఎన్నికల ముందు కొత్తగా చేసిన వాగ్దానాలకు ఎన్నికల కోడ్ అడ్డమొచ్చిందన్నారు. దాదాపు నెలరోజులు ఎన్నికల కోడ్ లేదు. అయినా అమలు చేయలేదు. బడ్జెట్లోనే వాటికి కేటాయింపులు చేసి కూడా అమలు చేయవచ్చు. పూర్తిస్థాయి బడ్జెట్ కాదన్న సాకుతో దాటవేసారు. వీటన్నింటికి తోడు ప్రజల నిరసనలను సహించడం లేదు. ప్రతిపక్ష పార్టీలనూ, ప్రజా సంఘాలనూ ప్రజల సమస్యలపై ఆందోళన చేస్తున్న వారిపై అణిచివేత ధోరణీనే అవలంబిస్తున్నారు. వేలాది సీసీ కెమెరాలలో ప్రజల కదలికలను బంధిస్తున్నారు. ఇదంతా నేరాలు నిరోధించేందుకే అంటున్నారు కానీ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి.
ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం పెరిగింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన ఫైన్ డబ్బులతోనే నిర్మిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్న కాని తమ పార్టీ శ్రేణులలో లుకలుకలు పెరిగిపోతూ నిరసనలు పెరిగిపోతున్నాయి. ఏకపక్ష ధోరణులు చెల్లవని చెప్పకనే చెపుతున్నారు. దీనికి పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతప్తి కూడా తోడైంది. వీటి ఫలితమే దాదాపు సగం పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పాలకులు ఈ వాస్తవాలను అంగీకరిస్తారో లేదా ఆత్మపరిశీలన చేసుకుంటారో తెలియదు. ప్రజల పథకాలను దూరం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం రోజురోజుకు చైతన్యవంతులవుతూ ప్రజలే ప్రతిపక్షమవుతూ ఉద్యమించే అవకాశం ఉంది. తెలంగాణలోని కొంతమంది ఆధికారుల సమాచారం ప్రకారం అసలు తెలంగాణాలో సరిపడా డబ్బులు లేవని అందుకే ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదని చెపుతున్నారు. ఆధికారుల సవిరీక్షా చేపడితే ఇది బట్టబయలు అవుతుందని ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను తన దగ్గరే ఉంచుకున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడు వస్తారో, పూర్తి స్థాయి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతారో ఇంకెన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందో చూడాల్సిందే…