- నేత్రావతి నదిలో మృతదేహం లభ్యం
- పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత
- నివాళులర్పించిన ప్రముఖులు
బెంగళూరు, జులై31 : కేఫ్ కాఫీడే సీఎండీ వి.జి సిద్దార్థ కథ విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం నేత్రావతి నదిలో బుధవారం ఉదయం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం వెన్‌లాక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేఫ్ కాఫీడే అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్దార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయారు. జులై 29 సాయంత్రం బెంగళూరు నుంచి వచ్చిన సిద్దార్థ, వ్యాపార పనులవిూద కేరళకు వెళ్తున్నాని కుటుంబసభ్యులతో చెప్పి బయలుదేరారు. రాత్రి 8గంటల ప్రాంతంలో నేత్రావతి నదిపై ఉన్న ఉల్లాల్ వంతెనవైపు వెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. అనంతరం అక్కడకు చేరుకున్న తర్వాత వంతెనపై కారు నిలపమని కోరిన సిద్దార్థ, వాహనం దిగి నడుస్తూ కొద్దిసేపు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత ఆయన కనిపించకపోవడంతో డ్రైవర్ ఆందోళన చెంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, డ్రైవర్ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచి మూడు పోలీసు బృందాలు ఓవైపు, ఎనిమిది పడవల సాయంతో గజ ఈతగాళ్లు, తీర ప్రాంత గస్తీదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మరోవైపు నేత్రావతి నదిని జ్లలెడపట్టాయి. నదిలో ఎనిమిదో స్తంభం వద్ద ఓ వ్యక్తి నీటిలో దూకడం చూశానని స్థానిక జాలరి ఒకరు వెల్లడించినట్లు మాజీ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నందున రక్షించే సాహసం చేయలేకపోయినట్లు ఆ జాలరి తెలిపారు. ఇదిలా ఉంటే సిద్దార్థ మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు వివరించారు. పోస్ట్‌మార్టం కోసం వెన్‌లాక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు. వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని, ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను అధికారులు ఒత్తిడి భరించలేకపోతున్నాని ఓ లేఖ రాసిపెట్టి సిద్దార్థ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎన్నో ఆశలతో కాఫీడే సామ్రాజ్యాన్ని స్థాపించినా, అనుకున్న విజయాన్ని సాధించలేకపోయానని ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తన సంస్థల్లో సుమారు 30 వేల మందికి ఉపాధి కల్పించానని, ఆర్థిక నష్టాలు తీవ్రంగా
కదిలించాయని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను విభాగం ఉన్నతాధికారి వేధింపులతో విసిగిపోయానని ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను సిద్దార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మాళవిక.. సిద్దార్థ కంపెనీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు. 2008 నుంచి సిద్దార్థకు చెందిన హాస్పిటాలిటీ బిజినెస్ పూర్తి బాధ్యతలు ఈమే నిర్వర్తిస్తున్నారు. కాఫీడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోనూ ఆమె ఒక సభ్యురాలు. ఇలా కెరీర్ హాయిగా సాగిపోతున్న సమయంలో సిద్దార్థ పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు. కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. ముంబయి, బెంగళూరు, చెన్నై, చిక్‌మగుళూరులోని కాఫీ డే దుకాణాలు, ఎస్టేట్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 650కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం
చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరోవైపు కేఫ్ కాఫీ డే గత కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీలో కొంత వాటాను కోకాకోలాకు విక్రయించాలని సిద్దార్థ అనుకున్నారు. ఇందుకోసం చర్చలు కూడా జరిగాయి.
ప్రముఖుల సంతాపం…..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ అల్లుడు వి.జి. సిద్దార్థ ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
– సిద్ధార్థ మృతిపట్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య దిగ్భాంతి వ్యక్తం చేశారు. తన వ్యాపార చతురతతో కర్ణాటక, ఈ దేశానికి ఎంతో సేవచేశారు. ఆ సేవలు చిరస్మరణీయం. నేటి తరానికి ఓ ఉదాహరణ. ఎస్.ఎం కృష్ణ కుటుంబసభ్యులు, సిద్దార్థ శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అన్నారు.
– మహింద్రా అండ్ మహింద్రా ఛైర్మన్ ఆనంద్ మహింద్రా సిద్ధార్థ మృతిపట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నాకు ఆయన(సిద్దార్థ) గురించి గానీ, ఆయన ఆర్థిక పరిస్థితుల గురించి గానీ తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే.. వ్యాపారవేత్తలు వ్యాపార వైఫల్యాల వల్ల జీవితాలను, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకూడదు. అది ఒక వ్యవస్థ మరణానికి కారణమవుతుందన్నారు.
– కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ సిద్ధార్థ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 1700 కాఫీడే అవుట్‌లెట్స్‌కు యజమాని అయిన సిద్దార్థ మృతదేహం ఓ నదిలో లభించింది. ఆయన మృతికి ఎవరు కారణం..? మోదీ ప్రభుత్వమా? ఐటీ అధికారులా? లేదా ప్రైవేటు ఈక్విటీ భాగస్వాములా? దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టాలి. అందరు వ్యాపారవేత్తలు దొంగలు కాదదన్నారు.
– సిద్ధార్థ మృతిపట్ల వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా దిగ్భాంతి వ్యక్తం చేశారు. సిద్ధార్థం భార్య మాళవిక, కుమారులు, మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
– వి.జి. సిద్దార్థ ఆకస్మిక మరణం విచారకరమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిద్ధార్థ మరణం ఎంతో దగ్భాంతికి గురిచేసిందన్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చిందని, ఆయనో జెంటిల్‌మెన్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేఫ్ కాఫీ డే మరింత బలంగా ఉండాలని కోరారు.
– సిద్దార్థ ఆత్మహత్యపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విచారం వ్యక్తం చేశారు. వీజీ సిద్దార్థది, తనది
దాదాపుగా ఒకే విషయమని, అతను ఒక గొప్ప వ్యాపారవేత్త అని మాల్యా బుధవారం ట్వీట్ చేశాడు. అతను రాసిన లెటర్ తనను కలవరానికి గురిచేసిందన్నాడు. ఆయన రాసిన లేఖలోని విషయాలతో తాను వినాశనానికి గురయ్యానని. ప్రభుత్వ ఏజెన్సీలు మరియు బ్యాంకులు ఎవరినైనా నిరాశకు గురిచేస్తాయన్నారు. తాను తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లిస్తానని చెప్పినా బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు తన పట్ల క్రూరంగా, దుర్మారంగా ప్రవర్తిస్తున్నాయని మాల్యా అన్నాడు. పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను తీర్చేందుకు సహాయం చేస్తాయని, కానీ తన విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నాడు. కాగా మైండ్‌ట్రీ లిమిటెడ్ కంపెనీతో తాను జరిపిన లావాదేవీల్లో అవకతవకలున్నాయని చెప్పి ఐటీ, ఈడీలు వేధించాయని సిద్దార్థ రాసినట్లుగా ఉన్న ఓ లేఖ కూడా ఇప్పటికే పోలీసులకు లభ్యమై విషయం తెలిసిందే.
అంచెలంచెలుగా ఎదుగుతూ..
కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలోని ఓ కాఫీ సాగు కుటుంబంలో పుట్టారు సిద్దార్థ. ఈ కుటుంబం గత 140 ఏళ్లుగా కాఫీ పంటలు పండిస్తోంది. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోక జ్ఞానం తెలుసుకునేందుకు బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఆటల విూదున్న శ్రద్ధ చదువు విూద ఉండేది కాదు. ఎనిమిదో తరగతిలో అత్తెసరు మార్కులొచ్చాయి. అతడి ప్రవర్తనను భరించలేని టీచర్ ‘ఒరే, నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేకపోతున్నానన్న సందేహం కలుగుతోంది. చదువుపై కాస్త శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తుకే మంచిది’ అంటూ కంటతడి పెట్టింది. టీచర్ కన్నీళ్లు చూశాక సిద్ధార్థ కళ్లు తెరిచాడు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్దార్థకు గౌరవం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సైన్యంలోకి వెళదామని డిఫెన్స్ అకాడవిూ పరీక్ష రాశారు. ఉత్తీర్ణుడు కాలేదు. చేసేది లేక మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఒక రోజు ‘నేను స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం బొంబాయి వెళ్లాలనుకుంటున్నా అని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి తండ్రి సిద్దార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపారు. చిక్‌మగళూర్ నుంచి బొంబాయి చేరుకున్న సిద్దార్థ్.. ఒక ఆఫీసుకి వెళ్లి రిసెప్షనిస్టుతో ‘నేను కర్ణాటక నుంచి వచ్చాను. మహేష్ కంపానీని కలవాలి’ అనడిగాడు. ‘ఆయన్ని కలవడానికి కొన్ని రోజుల నుంచి ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉన్నారు. నువ్విప్పుడొచ్చి కలుస్తానంటే కుదరదని రిసెప్షనిస్టు తెలిపింది. పదే పదే బతిమాలితే ఆయన గదిలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ‘సార్, విూ గురించి చాలా చదివాను.. విన్నాను. నేను ఎకనామిక్స్ పట్టభద్రుణ్ణి. చేస్తే గీస్తే విూ దగ్గరే శిష్యరికం చేయాలి. లేదంటే మా ఊరెళ్లి, నాకిష్టం లేకపోయినా కాఫీ తోటలు సాగు చేయక తప్పదు. ఒక్క అవకాశం ఇవ్వండంటూ వినయంగా వేడుకున్నారు. సిద్దార్థ అంకితభావాన్ని చూసి చిరునవ్వుతో ఓకే అన్నారు మహేష్ కంపాని. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి ప్రెసిడెంట్, జేఎం క్యాపిటల్ అధినేత అయిన ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చన్నది సిద్ధూ ఆలోచన. స్టాక్‌మార్కెట్‌లో పాఠాలు, ట్రేడింగ్ మెలకువలు ఆపోసన పట్టాడు. స్టాక్ మార్కెట్ గురించి కొంత అవగాహన వచ్చాక సిద్ధార్థ తిరిగి సొంతూరు చేరుకున్నారు. తాను బెంగళూరులో స్టాక్ బ్రోకర్ బిజినెస్ చేద్దామనుకుంటున్నానని, డబ్బు కావాలని తల్లిదండ్రులను అడిగారు. తల్లిదండ్రులు చేసేది లేక ఏడున్నర లక్షలు చేతికిచ్చి ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే, తిరిగొచ్చి కాఫీ తోటలు చూసుకో అని చెప్పి పంపించారు. ఆ డబ్బుతో శివన్ సెక్యూరిటీస్ అనే స్టాక్ బ్రోకింగ్ కంపెనీని ప్రారంభించారు. బొంబాయిలో సంపాదించిన పరిజ్ఞానం ఇక్కడ పనికొచ్చింది. వచ్చిన లాభాలతో
చిక్‌మగళూరులో కాఫీ తోటలు కొనేవారు. కొన్నాళ్లకు శివన్ సెక్యూరిటీస్ ‘వే 2 వెల్త్’గా మారింది. తొలుత కాఫీ ఎగుమతి నుంచి.. 1984లో శివన్ సెక్యూరిటీస్ అనే సంస్థను కొనుగోలు చేసిన సిద్దార్థ.. అనతి కాలంలోనే దాన్ని విజయవంతమైన పెట్టుబడి బ్యాంకింగ్‌గా తీర్చిదిద్దారు. అయితే సిద్దార్థ కుటుంబానికి 12వేల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ గింజలను ఎవరికో అమ్మే బదులు తానే రిటైల్ మార్కెట్లోకి ఎందుకు రాకూడదని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీ. 1992లో ప్రారంభించిన ఈ సంస్థ.. కాఫీ గింజలను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రెండేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా ఈ కంపెనీ ఎదిగింది.
1996లో కాఫీ డే మొదలు..
1996లో బెంగళూరులోని అత్యంత రద్దీ అయిన బ్రిగేడ్ రోడ్‌లో ‘కేఫ్ కాఫీ డే’ పేరుతో తొలి రిటైల్
అవుట్‌లెట్‌ను సిద్ధార్థ ప్రారంభించారు. అప్పట్లోనే ఇక్కడ ఒక కాఫీ, గంట ఇంటర్నెట్‌కు రూ.100 ఛార్జ్ చేసేవారు. ఈ అవుట్‌లెట్ విశేషాదరణ పొందింది. దీంతో ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించారు. దేశంలోనే అతిపెద్ద కాఫీ చైన్.. ప్రస్తుతం భారత్‌లో కేఫ్ కాఫీ డే పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అన్ని ప్రధాన నగరాల్లో ఈ కంపెనీ అవుట్‌లెట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1700 కెఫేలు, 48,000 వెండింగ్ మిషన్లు ఉన్నాయి. వియన్నా, చెక్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్టు లాంటి దేశాల్లోనూ కాఫీడే శాఖలు ఉన్నాయి. అలా తక్కువ కాలంలోనే కాఫీ డేకు మంచి గుర్తింపు లభించింది. కాఫీ కింగ్‌గా సిద్దార్థ్ పేరు మార్మోగింది. కాఫీడేతో పాటు హాస్పిటాలిటీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న సమయంలోనే సిద్దార్థ ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీలో పెట్టుబడులు పెట్టారు. 1999లో రూ.340 కోట్లతో వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాదే మైండ్‌ట్రీలో వాటాలను రూ.3వేల కోట్లకు అమ్మేశారు.