కోర్టు కేసులు, ప్రతిపక్షాల ఒత్తిడి, అన్ని పట్టణాలనుంచి ఫిర్యాదుల వెల్లువ ---------------------------------------------- - గందరగోళంగా వార్డులు, డివిజన్లు -ప్రతి పట్టణంలో ఫిర్యాదుల వెల్లువ -ఓటర్ల జాబితాలో తప్పులు, వేలాది ఓట్లు గల్లంతు -బోగస్ ఓట్ల నమోదు, అధికారులపై ఒత్తిళ్లు -నిర్వహణకు సన్నద్ధంగా లేమంటున్న అధికారులు -కోర్టులకు వెళ్తున్న కొందరు నేతలు -బైంసా, శంషాబాద్? ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే -ఆగస్టులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందేహమే -దసరా తర్వాతే జరగొచ్చంటున్న విశ్లేషకులు -కొత్త పుర చట్టం అమలు తర్వాతే ఎన్నికలు -------------------------------------------------
హైదరాబాద్, జ్యోతి న్యూస్ :
సీఎం కేసీఆర్ చెప్పినట్టు జూలై నెలాఖరు లేదా ఆగస్టు తొలి వారంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్న అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత జూలైతో పురపాలికల గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుందని వారంటున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక కనీసం 151 రోజుల గడువు అవసరమని, వార్డుల విభజన, ఓటరు నమోదుకు నిర్ణీత గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వ్యవహారం సెప్టెంబర్ మాసాంతంకల్లా ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు.
కొత్త చిక్కులు
మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం చేస్తున్న హడావుడితో కొత్త చిక్కులు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియ.. ఓటర్ల జాబితాలతయారీ గందరగోళంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ముసాయిదా కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉండటంతో రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వార్డుల పునర్విభజనతో పాటు ఓటర్ల జాబితాల్లో తప్పులపై వచ్చిన పిటిషన్లపై హైకోర్టు జోక్యం చేసుకుంది. రెండు మున్సిపాలిటీల్లో వార్డుల విభజనపై స్టే జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తమున్సిపల్ చట్టం రూపొందించటంతోపాటు.. ఆగస్టులో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం స్పీడ్ గా ఉంది. ఇందులో భాగంగానే కొత్త చట్టం అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయటంతో పాటు.. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటర్ల జాబితా, వార్డుల విభజన షెడ్యూలును ముందుకు జరిపింది. దీంతో పని ఒత్తిడితో పాటు రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు.
తొలి జాబితాకే సవరణ
త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు హడావుడిగా చేసిన వార్డుల విభజనలో పారదర్శకత, శాస్త్రీయత లోపించిందని చాలాచోట్ల రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. ప్రధానంగా ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో తొలి అంకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం కోసం ఈ నెల 3న 131 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనమైన జడ్చర్ల గ్రామ పంచాయతీతోపాటు నల్గొండ జిల్లా నకిరేకల్ నగర పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో మరుసటి రోజే ఈ రెండు మున్సిపాలిటీల పేర్లను ఎన్నికల సంఘం తొలగిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించబోయే మునిసిపాలిటీల సంఖ్య 129కి చేరింది.
రెండింటిలో వార్డుల విభజనపై స్టే
ఎన్నికలు నిర్వహించబోయే మున్సిపాలిటీల్లో చేపట్టిన వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై ముందునుంచీ ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేయిస్తోందని, తమ అభ్యర్థులు పోటీ చేసేందుకు అనువుగా ఓటర్ల జాబితాలు, వార్డుల విభజనను ఇష్టమొచ్చినట్లు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బైంసా మున్సిపల్ పరిధిలో వార్డుల పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందని, ఒకే దగ్గర ఉన్న ఇళ్లను వేర్వేరు వార్డుల్లో కలిపారని టీఆర్ఎస్ నాయకుడితోపాటు ఓ అడ్వకేట్? హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు వార్డుల పునర్విభజన ముసాయిదాపై స్టే ఇచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా లేదని ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్?ను? విచారించిన కోర్టు శుక్రవారం స్టే విధించింది. వార్డుల విభజన, రిజర్వేషన్ల వంటి అంశాలపై తిరిగి ఉత్తర్వులు ఇవ్వాలని, అప్పటివరకూ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించకూడదని జడ్జి జస్టిస్ నవీన్‌రావు మధ్యంతర ఆదేశాలిచ్చారు. దీంతో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మిగతా మున్సిపాలిటీల్లోని నేతలు కూడా ఇదే వరుసలో కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
కోర్టుకెళ్లిన ఎన్నికల సంఘం
ఈ ఏడాది జూలై 2న రాష్ట్రంలోని 53 పురపాలక సంఘాలు, 3 నగర పాలక సంస్థల పాలకవర్గాలకు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు దగ్గరపడుతున్నా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో భాగంగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ పురపాలక శాఖ న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ ఆసక్తి కలిగిస్తోంది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు 30 రోజులు, దాని తుది నోటిఫికేషన్‌కు మరో వారం రోజులు, వార్డులవారీగా ఓటర్ల నమోదుకు నెల రోజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు 60 రోజులు, వివిధ కేటగిరీలవారీగా వార్డుల విభజనకు వారం రోజులు, వార్డులు, చైర్పర్సన్ల రిజర్వేషన్ల ఖరారుకు మరో వారం .. ఇలా తమకు కనీసం ఐదు నెలల సమయం పడుతుందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పేరిట దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొనడం గమనార్హం.
కొత్తగా 68 మున్సిపాలిటీలు..!
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కొత్తగా 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో 173 గ్రామపంచాయతీలను విలీనం చేసింది. 131 పంచాయతీలను పొరుగున ఉన్న నగర పాలకసంస్థల్లో కలిపింది. బాదేపల్లి మున్సిపాల్టీలో విలీనమైన జడ్చర్ల పంచాయతీ పదవీకాలం వచ్చే ఏడాది డిసెంబర్ 4తో ముగియనుంది. నకిరేకల్ ఈ ఏడాది డిసెంబర్ 15న మున్సిపాల్టీగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా ఏర్పడ్డ పురపాలికల్లో వార్డులవారీగా చేయాల్సిన కసరత్తు చాలా ఉండటంతో జాప్యం జరుగుతుందని అధికారులు చెపుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ జూలై నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పగా, అధికారులు మాత్రం 151 రోజుల గడువు కావాలని కోర్టులో కౌంటర్ వేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది.
హడావిడిగా చేయబోమని ఈసీ హామీ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని హైకోర్టు ధర్మాసనం నమోదు చేసుకుంది. వార్డుల పునర్విభజనకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు.. వాటిలో ఎన్ని పరిష్కరించారు.. తదితర వివరాలను కౌంటర్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల గుర్తిం పు, వార్డుల పునర్విభజన, అభ్యంతరాల స్వీక రణ తదితరాలకు గడు వును నిర్దేశి స్తూ ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది అంజున్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గరువా రం సీజే నేత త్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఆ హామీ ఏమైంది..?
ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు 109 రోజుల సమయం అవసరమని సింగిల్ జడ్జి ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో సింగిల్ జడ్జి మరో 10 రోజులు అదనంగా కలిపి 119 రోజుల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. ప్రభుత్వం 30 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసిందని నివేదించారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలను కూడా చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకోవట్లేదన్నారు. ధర్మాసనం స్పం దిస్తూ సింగిల్ జడ్జికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది.
ఇదే మొదటిసారి..
ఎన్నికలకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వాకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు చెప్పారు. వార్డుల పునర్విభజన ఒక్కటే మిగిలి ఉందని పేర్కొన్నారు. 132 మున్సిపాలిటీల్లో 10 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సబబు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదంటూ ఎన్నికల సంఘం గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇలా ఓ ప్రభుత్వంపై ఎన్నికల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది జి.విద్యాసాగర్ తెలిపారు.